సాధారణంగా మధ్యాహ్న సమయం గురకేశ్వరారాధన లో నిమగ్నమై ఉంటాను. కానీ మొన్న ఎందుకో టీవి లో ఏదైనా సినిమా చూద్దామన్న దుర్భుద్ధి పుట్టింది. చానెల్స్ తిరగేస్తుంటే ఒక సినిమా మీద ద్రుష్టి పడింది. ప్రస్తుతం సినీ గగనం లో ప్రకాశిస్తున్న ఒక యువ కిశోరం హీరో గా నటించిన సినిమా అది. పేరు, వూరు , కధా కమామిషు మనకనవసరం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి హీరోస్ నటించిన ఏ సినిమా అయినా పెద్ద తేడా లేకుండా ఒకే మూస పోసినట్లు ఉంటాయి.
నేను చాల తక్కువ సినిమాలు చూస్తాను. వాటిలో థియేటర్ కి వెళ్లి చూసేవి ఏడాదికి ఒకటో లేదా రెండో ఉంటాయి. అన్ని భాషలలోనూ చాల మంచి విమర్శ వచ్చిన సినిమాలు మాత్రమే, అవి కూడా టీవీ లో వచ్చినప్పుడు చూస్తాను. రక్తపుటేరులు ప్రవహించేవి, అర్థం పర్ధం లేని స్కూల్ పిల్లల ప్రేమ కధలు, కన్నీరు మున్నీరు గా కంట తడి పెట్టించేవి, వెకిలి హాస్యపు సినిమాలకు నాకు చుక్కెదురు. ఇవన్నీ వడపోత పోసేక ఇక మిగిలేవి ఎన్ని సినిమాలో మీకే తెలుస్తుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే, సినిమా లో మొదటి సీనే సామూహిక ఊచకోత తో మొదలైంది. ఎవరో ఎందుకో, ఎవర్నో కాలక్షేపం కోసం అన్నట్లు చంపుకు పోతున్నారు. బక్క పలుచగా ఉన్న ప్రతినాయకుడు ఎదో మానసిక రుగ్మత వలన కాబోలు, చిన్న చితక ఆర్టిస్టులను, వంకీ కత్తి, పిస్తోలు మొదలైన ఆయుధాలతో, పొడవటం, కాల్చటం వంటి పనులు హడావిడి గా చేసేసి, వాళ్ళందరినీ పెట్రోలు లేదా డీజిల్ పోసి తగలెట్టండి అని పిల్ల గూండాలకు ఆర్డర్స్ జారీ చేసి, ఆ పల్లెటూరి చెరువులో 'యమహా' ఇంజన్ల స్పీడ్ బోటు ఎక్కి వెళ్ళిపోయాడు.
ఈ లోగా పట్టణంలో ఫాన్సీ బైక్స్ మీద, స్పోర్ట్స్ జీప్స్ మీద కాలక్షేపంగా తిరుగుతూ, పేట రౌడీలను అక్కడక్కడ చితకబాదుతూ, వేరే పనిపాట, చదువు చట్టుబండా, ఉద్యగం సద్యోగం లేకుండా ఉన్న మన వర్ధమాన యువ కిశోరం, సరదాగా తన బడుద్దాయి స్నేహితులతో సిగరెట్స్ కాలుస్తూ, బీరు బాటిల్స్ తో పండగ చేసుకుంటూ ఉంటాడు.
ఇంతలో పంజాబీ పన్నీర్ లాంటి పొడవాటి సొగసుకత్తే , హస్త భూషణం లా ఏవో రెండు పుస్తకాలు పట్టుకుని పాల నురుగులా ఎక్కడనుండో ఎగిరి వస్తుంది. ఆమె పాత్ర ఎంతవరకో తెలియదు కానీ, ఆమెనే కధానాయిక లేదా హీరోయిన్ అని మనం చచ్చినట్లు అనుకోవాలి. మన హీరో వెంటనే చేతిలో బాటిల్, వెను వెంటనే మనసుకూడా పారేసుకుని, అప్పుడే, అక్కడే, 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' లాగా 'ఐ లవ్ యు' చెప్పేసి, ఆమె ఒప్పుకోవడానికి దయతో ఒకటి రెండు రోజులు టైం కూడా ఇస్తాడు.
మనం గత ఇరవై ఏళ్ళు గా చూసినట్లే మన హీరోయిన్ ఒక గుబురు మీసాల కత్తుల రత్తయ్య లాంటి పెద్ద ఫ్యాక్షనిస్ట్ గారి కుమార్తె. ఆయన ఉండే పెద్ద హవేలీ కూడా లోగడ సినిమాలలో చూపించిన ఇంటికే కొద్దిగా రంగులు మార్చిన సెట్టింగే. బయట కత్తులు గట్రా నూరుతూ, పురికొసలతో వంకాయ బాంబుల్లాంటివి కడుతూ, ఎఫెక్ట్ కోసం ఎవరో అమాయకుడిని గొడ్డళ్ళతో నరికేస్తూ కనబడే వారంతా కూడా మనం ఇదివరకు సినిమాలలో ఇంచుమించు అదే పనులు చేస్తూ కనబడ్డ వారే.
అదేం ప్రారబ్ధ కర్మో తెలియదు కాని, ఈ అందగత్తెలకి ఎప్పడూ సజ్జనులైన మామూలు కుటుంబీకులు తల్లిదండ్రులు గా ఉండరు. పైగా వీరిని చూస్తే జన్యు శాస్త్రం మీద నమ్మకం కూడా పోతుంది . మీరే చెప్పండి, లేకపోతే ఏ సినిమా లో చూసినా తుమ్మ మొద్దుల్లాంటి విలనీయులకి , ఈ పంజాబీ మీగడ తరకలాంటి కూతుళ్ళు ఎలా ఉంటారు? పోనీ వారి భార్యలు కూడా ఉత్తర భారతీయులు కారు. కానీ మనం మారం! దశాబ్దాలుగా అలాగే తీస్తున్నారు, మనం అలాగే చూస్తున్నాం.
ఇక సినిమా గురించి ఆట్టే చెప్పేది ఏమిలేదు. హీరో గారు ఒంటరిగా లంక లో ప్రవేశించిన హనుమంతుడు లా ఈ ఇంట్లో తనదైన రీతిలో ఒక జంపింగ్ బైక్ మీద ఉప్పు అద్దాలు పగలుకోట్టుకుంటూ, చెవులు బద్దలయ్యేలా ఎంట్రీ ఇస్తాడు. విలనీయుని చుట్టూ ఆ మారుమూల పల్లెటూళ్ళో, మండిపోతున్న ఎండలు, చిర్రెక్కించే చెమటల్లో, నల్ల సూట్లు, గాగుల్స్, చెవిలో బ్లూ టూత్ పెట్టుకుని, చేతిలో ఆటోమేటిక్ గన్స్ తో ఒక యాబై మంది ఉంటారు. ఇంత అవసరం అంటారా చెప్పండి? ఆ !! మనకెందుకు లెండీ ! చుట్టుముట్టిన ఆ బ్లూ టూత్ గాళ్ళను, 'సూపర్ మాన్' కే ఫైట్స్ నేర్పే మన హీరో చావ చితక తంతాడు.
తరువాత కధలో ఏముంది, ఎత్తులు, పై ఎత్తులు, ఏడుపులు, పెడ బొబ్బలు, రంకెలు. ఈ మధ్యలో సమయం, పాడు లేకుండా, ఆ మీగడ తరక ఎక్కడ్నుంచో మెరుపులా దిగి, తన పారితోషికానికి న్యాయం చేకూరుస్తూ, మన కుర్రాడిని పాటలు గట్రా పాడుకోవటానికి ఇస్తాంబుల్, బార్సిలోనా, బుడాపెస్ట్, పట్టుకుపోతూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పాటలు పాడేసుకుని, మన కుర్రాడు బుద్దిగా మళ్ళీ ఈ పల్లెలోకి దిగిపోతాడు.
చివర్లో సామూహిక మారణ కాండలు, రక్త పాతాలు. దానికి వూళ్ళో జనం అంతా పిల్ల మేకా పిలవని పేరంటం లాగ దిగిపోతారు. ఏమీ తోచని సైడ్ గూండా ఒకడు, ఒక పెద్ద ఇండస్ట్రియల్ రెంచ్ పట్టుకుని గుళ్ళో కొబ్బరికాయలు కొట్టినట్లు జనాల బుర్రకాయలు పగలుకొట్టుకుంటూ తిరుగుతుంటాడు. ఇలోగా మన హీరో, పూర్వం రైల్లో బొగ్గేసే పెద్ద పార లాంటిది పట్టుకుని ఎంతోమందికి దేహశుద్ధి చేస్తుంటాడు. ఇంతలో రెంచ్ గూండా గాడు చేస్తున్న పాడు పని చూసి, అవటా అని చేతిలో పార పాడేసి, వాడ్ని ఎలాగో వంగో పెట్టి నాలుగు గుద్దులు పీకి, రెంచ్ లాక్కుని పెద్ద విలనీయుడి దగ్గరకు పోతాడు.ఈ లోగా కొంప మునిగినట్లు పట్నం నుంచి ఓలా కాబ్ వేసుకుని అక్కడకు వచ్చిన హీరో తల్లి దండ్రుల్ని విలనీయుడు తాళ్ళతో కట్టి, కట్టె పేళ్ళ తో బాదుతూ ఉంటాడు.
చేతిలో రెంచ్ ఊపుకుంటూ అడ్డొచ్చిన చిల్లర గూండాల కాళ్ళు కీళ్ళు విరగ గొట్టుకుంటూ, వాళ్ళ మెడలు, లేత బెండకాయ ముచిక విరగ గొట్టినట్లు అలవోకగా విరిచేస్తూ విలనీయుడి భరతం పట్టటానికి వెళ్తాడు. అక్కడనుండి చాల రీళ్ల వరకు వారిద్దరూ, వాలి సుగ్రీవులలాగా గుద్దుకుంటూ, రక్కుకుంటూ, కుమ్ముకుంటూ, పొడుచుకుంటూ, పిల్లి మొగ్గలేస్తూ, బులెట్ దెబ్బలు తిని మళ్ళీ ఏమి అవ్వనట్లు లేచి తిరిగి కొట్టుకుంటూ కాలం గడుపుతారు. చివర్లో రక్తం ఉమ్ముకుంటూ పంచ్ డైలాగ్స్ కొన్ని విసురుకున్నాకా, ఎందుకో అంత విలనీయుడిలోనూ 'ఛీ ఎందుకీ బతుకు?' అన్న పశ్చాత్తాపం కలిగి కూతురు చేతిని మన హీరో చేతిలో పెట్టి జేబు గుడ్డతో నుదుటి మరియు మూతి మీది రక్తపు మరకలు తృప్తిగా తుడుచుకుంటాడు. ఇక ఈ గ్రూప్ ఫోటోలో పడటానికి క్షతగాత్రులైన, జీబురు తలల వాళ్ళు, మాసి వెలసిన గడ్డాల వాళ్ళు, కండల జబ్బల వాళ్ళు, బండ మొహాల వాళ్ళు, గళ్ళ లుంగీల వాళ్ళు , చంకల బనీన్ల వాళ్ళు మొదలైన చిల్లర గూండాలు కుంటుకుంటూ వస్తారు.
ప్రారబ్ధం కాకపోతే, మీగడ తరక హీరోయిన్ ఎప్పుడూ, అంటే ఇటువంటి అన్ని సినిమాలలోనూ, తన తండ్రి చేత చితక కొట్టించుకుని, తన తండ్రిని చావబాదిన కుర్రాడినే ఆనందంగా పెళ్లి చేసుకుంటుంది. ఎదురుకోళ్ళు తంతు వీళ్ళకి ఇలాగే ఉంటుందేమో.
ఇక పోతే, ఈ మార్క్ సినిమాలలో మనం తెలుసుకునే ముఖ్యమైన జ్ఞాన గుళికలు ఎన్నో వుంటాయి. నా బుర్రకి ఈ కాసినే తోచాయి. 1. ఇందులో ప్రవహించే రక్తం తో ఒక బ్లడ్ బ్యాంకు పెట్టొచ్చు. 2 . ఇందులో వాడే మారణాయుధాలతో సరిహద్దు సైనికులు దేశాన్ని రక్షించుకోవచ్చు. ౩. విలన్ వాడే వాహనాలతో ఒక కాబ్ కంపెనీ పెట్టుకోవచ్చు. 4. హీరోలకు ఏ అర్హత, ఉద్యోగం లాంటివి అవసరం లేదు. వాళ్ళు కాల్చటానికి సిగరెట్లు, తాగడానికి బీరు బాటిల్స్ పుష్కలంగా లభించును. కానీ ఆ కిటుకు మన బోంట్లకు తెలియదు. 5. వారికి పుట్టుకతోనే సకల లలితకళలు, యుద్ధవిద్యలు వచ్చును. 6. వారికోసం మీగడ తరక లాంటి అమ్మాయి ఏ పల్లెలోనైన సరే వేచియుండును. మాట్రిమోనీ.కామ్ సహాయం అవసరం లేదు.7. వారుండేది మన పట్టణం లేక పల్లె లో అయినా, దేశం మాత్రం మనది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారి దేశంలో, పోలీస్, న్యాయ, రాజ్యంగ వ్యవస్థలు ఉండవు. ఎవరికీ వారే వారి పద్దతిలో సెటిల్ చేసుకుంటుంటారు.
మొత్తానికి సినిమా చూసేసరికి ఒక విధమైన మానసిక వికారం, జీవితం మీద విరక్తి , వేదాంత ధోరణి కలిగాయి. వచ్చిన తలనెప్పి, వికారం పోవటానికి, నాకు ఆ సినిమా హీరోకి ఉన్న పానీయ వసతులు లేకపోవడం వలన, రెండు చెంచాల మాదీఫల రసాయనం పుచ్చుకుని, పూజా మందిరం లోకి వెళ్లి ...
అని గట్టిగా చెంపలు వేసుకున్నాను.

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా,
శ్రవణనయనజం వా మానసం వా, అపరాధమ్ క్రియన్తే ....
మయా దోషాన శేషన్వితాన్ హరే
క్షమస్వత్వం... క్షమస్వత్వం శేష శైల శిఖామణే!