మొన్నీ మధ్యన మా శ్రీమతితో కలసి మా ఇలాకా లోనే పెద్దదైన ఒక ప్రసిద్ద చీరల షాప్ కి వెళ్ళాను. అవీ ఇవీ కొన్నతరువాత, ఏవో మాచింగ్ గుడ్డలు కొనుక్కొస్తానని ఇంకో అంతస్తు కి వెళ్ళింది. ఈ లోగా నన్ను ఒక చీరల కౌంటర్ కి ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చుని వెయిట్ చెయ్యమంది. నాకు తోచక, నా ఫోన్ వాట్స్అప్ సంగతులు చూసి, అన్నీ పనికిమాలిన ఫార్వార్డ్స్ మాత్రేమే ఉండేసరికి చికాకు వేసి ఫోన్ జేబులో పెట్టేసుకున్నాను. ఎదురుగా బీరువాలనిండా రంగురంగుల చీరలు ఉన్నాయి. వాటిని అమ్మే కుర్రవాళ్ళు శాంతంగా గిరాకీ కోసం చూస్తున్నారు.
ఇంతలో ఇద్దరు మధ్యతరగతి గృహిణులు వడివడిగా అడుగులు వేస్తూ ఆటు వచ్చారు. వారిలో ఒక ఆవిడకి సుమారు యాభై ఏళ్ళ వయసు ఉండచ్చు. రెండవ ఆవిడ బహుశా ముప్పైలలో ఉండవచ్చు.
సేల్స్ మెన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. నేను ఉదాశీనంగా చూస్తున్నాను. ఇంతలో వారిలో పెద్దావిడ " మీ దగ్గర గద్వాల్ చీరలు ఉన్నాయా " అని దర్జాగా అడిగింది.
"ఉన్నాయమ్మ కూర్చోండి" అన్నాడు.
తరువాత సంభాషణ ఈ విధంగా సాగింది.
" కొంచెం పెద్ద వయసు వారికి పనికిచ్చే చీరలు చూపించండి"
" ఏ రేంజ్ లో చూపిన్చ మంటారు?"
" సుమారు రెండు వేలలో చూపించండి"
అతను నాలుగైదు చీరలు తీసాడు. ఇంతలో పెద్దావిడ, " అలా కాదు వెయ్యనుండి, మూడు వేల వరకు చూపించండి" అంది. అతను చీరల దొంతరలు తీస్తున్నాడు.
ఇంతలో చిన్నావిడ " వదినా మనం రెండు వేలవి చూస్తే చాలు కదా" అని అమాయకంగా అడిగింది.
" నీకు తెలియదు . మనం ధర చెప్పేస్తే నాలుగైదు చీరలే చూపిస్తాడు. ఒక పెద్ద రేంజ్ ఇస్తే చాల చూడచ్చు" అని మెల్లగా చిన్నావిడ చెవిలో జ్ఞాన గుళిక వేసింది. చిన్నావిడ వినయంగా తల ఊపింది.
ఇదేదో మంచి గిట్టుబాటు టైం పాస్ వ్యవహారం లా ఉందే అని సోఫాలో కొంచెం ముందుకు జరిగి చెవులు రిక్కించాను.
చీరలబ్బాయి, ఇంతలో ఒక దొంతర తీసి ఒక చీర మడత తీసి చూపించాడు.
" ఇవి సీకో చీరలు, పెద్దవాళ్ళకి ఎలా పనికొస్తాయి?" అని తల అడ్డంగా ఊపింది. (సీకో కి అర్థం నాకైతే తెలియదు )
"అలాగా, ఐతే ఇవి చూడండి " అన్నాడు
" ఇవి మరీ పలచగా ఉన్నాయి. పెద్దవాళ్ళకి బాగోదు" అంది.
" ఆవిడ వయసు ఎంత ఉండవచ్చు అమ్మా ?" అడిగాడు.
" సుమారు ఎనభై ఉంటాయి" అంది.
" ఓహో అలాగా , ఇయితే ఇవి చూడండి" ఇంకో దొంతర ముందుకు తోసాడు.
" అబ్బే ఈ బోర్డర్ మరీ చిన్నది గా ఉంది"
" సరే దీనికి పెద్ద బోర్డర్ ఉంది చూడండి"
" బోర్డర్ సరే కానీ కలర్ మరీ పాతగా ఉంది. మంచి ఇంగ్లిష్ కలర్స్ ఏవైన ఉంటే చూపించండి"
ఇంగ్లిష్ కలర్ అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఊపిరి బిగపెట్టి చూస్తున్నా. అతడు బీరువాలోంచి పూతరేకులలాగా మడత పెట్టిన మరో దొంతర తీసాడు. అందులో కొంచెం ముదురు ఆకుపచ్చ రంగు చీర తీసి "చూడండమ్మా మంచి ఇంగ్లిష్ కలర్ " అన్నాడు.
వార్నీ ..ఇంగ్లీష్ కలర్, ఇంగ్లిష్ కలర్ అంటే ఇదా అని నిరుత్సాహ పడ్డాను.
"కలర్ బానే ఉంది కానీ ఎందుకో ఆకర్షణ లేదు. పోనీ వేంకటగిరి చీరలు చూపించండి" అంది.
అతను ఓపిగ్గా ఇంకో బీరువాలోంచి మరో దొంతర తీసాడు. ఒక చీర చూపించి " మంచి బోర్డర్, మంచి రంగు. ఇది మీకు నచ్చుతుంది " అన్నాడు.
ఆవిడ పరకాయించి చూసి, రేట్ లేబెల్ చూసి " ఇది మూడున్నర వేలు ఉందే ఎందుకంత?" అని అడిగింది..
" దీనికి జరీ బుటాలు పెద్దవి ఉన్నాయమ్మ . అందుకే కొంచెం ధర ఎక్కువ " అన్నాడు.
"అంత పెద్ద బుటాలు అక్కర్లేదు, చిన్నవి ఉంటే చూపించండి" అంది
" అయితే ఇది చూడండి , బుటాలు చిన్నవి, ధర కూడా తక్కువే" అన్నాడు.
" దీనికి బ్లౌస్ ఉందా?"
" లేదమ్మా ! నేత చీరలకి దేనికీ ఉండవు. విడిగా తీసుకోవాలమ్మ " అన్నాడు.
"మళ్ళీ అదొక తల నెప్పి. పోనీ మంగళగిరి, గుంటూరు కాటన్ చూపించండి"
అతను మరొక బీరువా లోంచి ఇంకో దొంతర తీసి మరో చీర చూపించాడు.
" బోర్డర్ బానే ఉంది, వీటిలో కలర్స్ చూపించండి" అంది.
" అవిగో నమ్మా ! ఈ మూడు రంగులు ఉన్నాయి" అన్నాడు.
" ఎరుపు, పసుపు, నీలం ...అంతేనా ...గంధం రంగు లేదా?"
" లేదమ్మా ! సరే ఈ గుంటూరు జరీ చీరలు చూడండీ. ఇవి తప్పక నచ్చుతాయి" అని ఇంకో దొంతర తోసాడు.
" అబ్బే ఈ రంగులు అన్నీ ఆల్రెడీ ఉన్నవే. ఇంకా మదుర, కంచి కాటన్ మరి ఏమేమి వున్నాయో అన్నీ చూపించండి. తొందరగా చూపించండి. మా అయన బయట కారులో కూర్చున్నారు. ఈ పాటికి ధుమ ధుమ లాడుతూ ఉంటారు" అని అసహనం గా అంది.
"ఒక్కొక్కటీ చూపిస్తున్నాను కదమ్మా. ఈ నేత చీరలు మామూలు చీరల్లాగా పోగులు పోయ్యలేము. మడతలు నలిగి పోతాయి. అయినా గుంటూరు, మంగళగిరి నుండి మదుర, కంచి వెళ్ళాలంటే కొంచెం సమయం కావలి కాదమ్మా " అని తన పరిధిలో జోకేడు. దానికి ఏమీ స్పందించక, " ఏమిటో నేను అనుకున్నది దొరకటం లేదు" అని నిరాశగా అంది.
అసలు ఈవిడకి ఏం కావలబ్బా ? నా మైండ్ ఎసరు లాగ మరిగి పోతోంది. నాకు అతను చూపించిన చాల మటుకు చీరలు బావున్నాయి అనిపించింది. మరి ఆవిడకు ఎందుకు నచ్చటం లేదు? నాకే కనుక కొనే అధికారం ఇచ్చి వుంటే, పది నిముషాలలో రెండు చీరలు కొనేసేవాడిని. బహుశ ఆ అధికారానికి అర్హత కూడా కావాలేమో ! అందుకే మా శ్రీమతి నాకు ఎప్పుడు ఆ అధికారాన్ని ఇవ్వలేదు అనుకుంటా. ఆవిడకి కావలసినదేమిటి అన్న నా మనసులోని ప్రశ్న అటు ఇటుగా చీరలబ్బాయి అడిగాడు.
"అదుగో ఆ బోర్డర్, ఈ బుటాలు, మరి ఆ ఇంగ్లీష్ కలర్ లో ఉండాలి. ధర కొంచెం అటు ఇటు గా రెండు వేలు ఐనా పరవాలేదు" అంది ట్రేడ్ సీక్రెట్ బయట పెట్టి.
"మంచి కాంబినేషన్ అమ్మా ! కానీ చీరల కంపెనీ వాళ్ళు ఇంకా చేసి ఉండరు. వాళ్ళ మోడల్స్ ఎప్పుడు మీ ఆలోచనల కంటే బాగా వెనకబడి ఉంటాయమ్మా " అని ఒక కాంప్లిమేంట్ విసేరేడు.
ఆ పొగడ్తని ఒడుపు గా పట్టుకుని దర్పంగా చిన్ననవ్వు చిన్నావిడ కేసి విసిరింది. ఆవిడ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుని చూసిన పార్ధుని లాగ తల ఆరాధనా భావం తో వంచింది.
ఇంతలో పెద్దావిడ చటుక్కున కుర్చీ లోంచి లేచి ఒక బీరువా వైపు నడిచి, ఒక దొంతర చూపించి అవి ఏమిటి అని అడిగింది.
"అవి సీకో చీరలమ్మా . మీరు మొదటే వద్దన్నారు కదా !" అన్నాడు.
పెద్దావిడ ఒక క్షణం అలోచించి "పోనీ మళ్ళీ ఒక సారి చూస్తాను, చూపించండి" అంది.
అతను ఆ దొంతర తీసి ఆమె ముందు పేర్చాడు. ఆవిడా గబ గబా వాటిని క్రిందా మీద పరకించి చూసింది. హటాత్తుగా "ఇదిగో దీనికోసమే నేను వెతుకుతున్నా" అని ముచ్చట పడిపోతూ ఒక చీర చూపించింది. ఇవి ఎలాగూ ఈవిడికి నచ్చవు అని నిర్లిప్తంగా ఉన్న చీరలబ్బాయి ఉలిక్కిపడి "బ్రహ్మండమైన సెలక్షన్ అమ్మా మీది " అని పొగడ్తలతో మున్చేసాడు. శత్రువులను చీల్చి చెండాడి విజయాన్ని చేజిక్కించుకున్న కిరీటి లాగ పెద్దావిడ విజయ గర్వంతో చూసింది. చిన్నావిడ గురు భావంతో పెద్దావిడకి కరచాలనం చేసింది.
నాకు ఈ వ్యవహారం ఏమాత్రం కొరుకుడు పడలేదు. ఎదో ఇంకా సస్పెన్స్ ఉంటుందని చూస్తున్న హిచ్ కాక్ సినిమా లో సడెన్ గా 'ది ఎండ్' అని పడినట్లు నాకు జరిగిన సంగతి అర్థం చేసుకోవడానికి కొన్ని నిముషాలు పట్టింది. చీరలబ్బాయి బిల్లింగ్ చేయించటానికి వెళ్ళాడు.
పెద్దావిడ " చూడు రమా ! మనం సేల్స్ మాన్ చూపించిన ఏ చీరా కొనకోడదు. వాడు హడావిడిగా ఎదో చెప్పేసి, ఇది బావుంటుంది అది బావుంటుంది అని మన చేత వాడికి తోచిన చీర కొనిపించడానికి చూస్తాడు. అనుభవం లేని వాళ్ళు ఆ మాయలో పడిపోతారు. మనం సాధ్యమైనన్ని ఎక్కువ చీరలు చూసి, మనకు ఏమి కావాలో వాడికి తెలియనివ్వకుండా, అన్నీ చూసి మనకు బావుందనిపించిన చీరే మనం కొనుక్కోవాలి" అని 'చీరబేరోపదేశం' చేసింది.
నాకు కొంత జ్ఞానోదయం అయిందని చెప్పాలి. ఒక ఎనభై ఏళ్ల సీనియర్ సిటిజెన్ ఎప్పోడో ఒక సారి కట్టుకునే చీర కొనటానికే ఇంత ప్రజ్ఞ , సమయం కావాల్సివస్తే , ఇక పెళ్లి చీరలు బేరం చేయటానికి ఎంత కావాలో! అందుకే పెళ్ళిళ్ళ టైం లో ఆడవాళ్ళు కంచి, మదుర, బెనారస్ వైపు వలస వెళ్ళిపోయి నెల రోజులకు, వెలిగిపోతున్న కళ్ళతో, చాకలి మూటల లాంటి చీరల దొంతిరితో, పీక్కుపోయిన మొహాలతో, చిక్కి శల్యమైన మనీ పర్స్ తో తిరిగి వస్తారు. టైం చూసుకున్నాను. ఒక గంట అవుతోంది.. ఇంతకీ మా శ్రీమతి రాలేదే ? బహుశ ఇదే సీన్ ఇంకో అంతస్తులో నడుస్తోందేమో! నా కళ్ళు కొత్త జ్ఞానంతో నిర్లిప్తంగా ఎదురు చూస్తున్నాయి.
( నేను చూసిన, విన్న యదార్ధ సంఘటన, సంభాషణలకు కొంత కాల్పనికత జోడించి వ్రాయటం జరిగింది. ఇది ఎవరు ఎక్కడ చేసేరు అన్న సందిగ్దం లో పడకండి. ప్రతీ చోట, ప్రతీ రోజూ, ప్రతీ చీరల షాప్ లో ఇంచు మించు ఇదే ప్రహసనం బహుశ జరుగుతూనే ఉంటుంది.)
4 comments:
ఆడవాళ్ళు చీరలు కొనేటప్పుడు ఎలా వ్యవహరిస్తారో,బేరాలు ఆడతారో, చివరికి ఇది కొంటారో, ఖచ్చితంగా అలానే రాసేరు.చాలా హాస్యంగా ఉంది సంభాషణ.
పాపం చివరికి ఆ పలుచని సీకో చీర ఆ పెద్దావిడ ఎలా కట్టు కున్నదో?
చాలా బాగుంది. నాకయితే నాలుగున్నర దశాబ్దాల క్రిందట గుంటూరు శంకరవిలాస్ బస్టాండు దగ్గర ఓ మధ్యాహ్నం సిటీ బస్ కోసం ఎదురు చూస్తూ ఎండకు తాళలేక ప్రక్కనే ఉన్న ఓ బట్టల షాపులోకి దూరినప్పటి, కాస్త అంటూ ఇటూగా ఇలాంటి అనుభవం గుర్తుకువచ్చింది.
బావుంది. ఈ లేడీస్ చీరలు కొనేటప్పుడు పెట్టె దృష్టి, వెచ్చించే సమయం మొగుడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా పెడితే బావుంటుంది.10 నిముషాలలో parents ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని ఒప్పుకునేస్తారు ఎదో చొక్కా కొన్నంత తేలికగా. చీరలు కొనేటప్పుడు మాత్రం మొగుడిని select చేసుకున్నట్టుగా చాలా selective గా వుంటారు.
Sieco ante Singareni Collieries (boggu company) low panichesi vari kosam cheya badina cheerala?
Post a Comment