Sunday, March 21, 2010

శ్రీ సీతా రామాభ్యనమః
పారిజాత తరువు పరవశించి పూసింది కోటి సుమాలు
వనపాలి మురిసి కురిసింది గురివింద వర్షాలు
తులసమ్మ మై మరచి చిగురించే రెమ్మ రెమ్మ కు వేయి దళాలు
ఇనకుల రామయ్య ఉదయించే నేడు, కలుగు అనేక శుభాలు

పదములు తాకగ పులకరించెను ఒక రాయి,
పడతి గా మారి ప్రణమిల్లెను శాప విమోచనమై.
కఠిన శిలలు వోలె కారుణ్యము లేక జనులు,
బడయుచున్నారు,బండరాయలవంటివే హృదయాలు,
కరుణించి పదమిడు మా హృదిని, వీక్షించి నీ శాంత నయనాలు ,
కరిగి జనియిన్చునేమో ప్రేమాను రాగాలు, సమయు కార్పణ్యాలు .

పరిణయమాడంగ చేపట్టి విరిచేవు మేటైన శివుని విల్లు,
సీతమ్మ హృదయాన కురిసింది ప్రణయాల విరిజల్లు.
మానవాళి మదియందు నెలకొంది అహంకారపు పెను విల్లు,
వేగంగా విరువగా రావే, వేలెసేను లోకాన మమతల హరి విల్లు .

కరకు బాణాల బడవైచితివి దనుజులెల్లరినో,
త్రుంచి వైచితివి సంగారాన లంకేశు శిరాలెన్నో.
మనుష్య హృదయాన ప్రజ్వరిల్లే పెక్కు కామనలు,
దురాశ, దుర్నీతి, వ్యామోహ మద మత్సరాలు,
ఇవియే కాబోలు, మారు మారు మొలకెత్తు 'దశకంట' శిరాలు
దహియించగా వీటిని, విడువుమయ్య యిక రామ బాణాలు

బంధకవి సుబ్రహ్మణ్యం
21 -మార్చ్ 2010
(ఈ కవిత తొలి వ్రాత ప్రతి 2004 మార్చ్ నెల 30 తారీఖున శ్రీ రామ నవమి సందర్భమున తయారుచేయటం జరింగింది )
శ్రీ రామ నవమి శుభా కాంక్షలు

No comments: